నరసాపురంలో విదేశాలకు వెళ్ళే వారికి సక్రమ వలసలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఏపీ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎన్ఆర్టీ సొసైటీ
మన రాష్ట్రం నుండి చాలామంది ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర దేశాలకు వెళ్తున్నారు. అయితే ఎక్కువమంది అక్రమ ఏజెంట్ల మాటలు నమ్మి, అవగాహన లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులకు గురవుతున్న వారి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ వలసలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో సక్రమ వలసలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ది ధ్యేయంగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి అధ్యక్షతన ప్రవాసాంధ్రులకు ఎన్నో సేవలు అందిస్తోంది. విదేశాల్లో మరణించిన వారి కుటుంబానికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా, ప్రవాసాంధ్ర భరోసా బీమా ద్వారా కుటుంబానికి రూ.10 లక్షల ప్రమాద బీమా..ఇంకా అనేక ప్రయోజనాలు, ఉచిత అంబులెన్స్ సేవ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏపీఎన్ఆర్టీఎస్ కో ఆర్దినేటర్స్ ద్వారా ఆయా దేశాలలో ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయపడటం, స్వదేశానికి రాలేక ఇబ్బంది పడుతున్న వారిని స్వదేశానికి తీసుకురావడంలో సహాయం... ఇలా అనేక సేవలను ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్రులకు అందిస్తోంది.
జిల్లా కలెక్టర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు మరియు జిల్లా పరిపాలన విభాగం సమన్వయ సహకారాలతో, ఏపీఎన్ఆర్టీఎస్ ఈరోజు (30.11.23) ఉదయం 9:30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రక్కన ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర్ భవన్ వేదికగా ఉపాధి, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే కార్మికులకు, ఉద్యోగులకు సక్రమ వలసలపై ముందస్తు అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి DSP శ్రీ. జి. పైడేశ్వర రావు, CI (రూరల్) శ్రీ. కె. గోవింద రాజు, CI (అర్బన్) శ్రీ. శ్రీనివాస్ మరియు EORD శ్రీ. ఆంజనేయ శర్మ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
కార్యక్రమం ప్రారంభమవగానే ముందుగా ఏపీఎన్ఆర్టీఎస్ డిప్యూటి డైరెక్టర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్రులకు అందిస్తున్న వివిధ సేవల గురించి వివరించారు. సక్రమ వలసల పై అవగాహన సదస్సుల ఉపయోగం తెలియజేసారు.
DSP శ్రీ. జి. పైడేశ్వర రావు మాట్లాడుతూ....అక్రమ ఏజెంట్లను నమ్మి మోసపోయిన వారి గురించి మనం ఎక్కడో ఒకచోట పత్రికల్లో చూస్తుంటాము, వింటుంటాము. వీరిలో చాలామందికి సరైన అవగాహన లేక, ఎవరిని సంప్రదించాలో తెలియక ఉపాధి నిమిత్తం వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడుతుంటారు. ఏపీఎన్ఆర్టీఎస్ నిర్వహిస్తున్న ఈ సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమం అత్యంత ఉపయోగకరమని అన్నారు. ఇక్కడకు వచ్చిన వారు ఈ సమాచారాన్ని మీమీ చుట్టుప్రక్కల వారికి తెలియజేసి ఏపీఎన్ఆర్టీఎస్ ను సంప్రదించమని తెలిపారు.
ముఖ్యంగా పల్లెల్లో వారు ఎక్కువగా నష్టపోతున్నారని, అమాయకపు మాటలు నమ్మి, మంచిగా సంపాదించవచ్చు అన్న తాపత్రయంతో విజిట్ వీసాల మీద విదేశాలకు వెళ్తున్నారని రూరల్ CI శ్రీ కె. గోవింద రాజు అన్నారు. తీరా అక్కడకు వెళ్ళిన 6 నెలలలోపే వారికి పూర్తి విషయం అర్థమై దిక్కు తోచని స్థితిలో ఉంటున్నారు. దీనిని నిరోధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. కానీ, ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీ సొసైటీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీరు విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేయాలో వారికి ఫోన్ చేసి తెలుసుకొని సురక్షితంగా వెళ్లిరండి అన్నారు. కేవలం ప్రవాసాంధ్రుల కోసం మాత్రమే పనిచేసే ఒక సంస్థ మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణమన్నారు. వీరు నిర్వహిస్తున్న ఈ అవగాహనా సదస్సులలో విదేశాలకు వెళ్లాలనుకునే వారు తప్పకుండా పాల్గొనాల్సిందిగా కోరారు.
అర్బన్ CI శ్రీ. శ్రీనివాస్ మాట్లాడుతూ...విదేశీ చట్టాలు, అక్కడి సంస్కృతి సంప్రదాయాల గురించి కుడా పూర్తిగా తెలుసుకొని సక్రమంగా వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమాలకు హాజరైన స్వచ్చంద సంస్థల వలంటీర్లు, మహిళా పోలీసులు, మెప్మా (MEPMA) సభ్యులను... ఏపీఎన్ఆర్టీఎస్ ప్రతినిధులు ప్రతి ఇంటికి ఏపీఎన్ఆర్టీఎస్ అందిస్తున్న సేవలను తెలియజేయాలని కోరారు.
విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్నవారు ఏదేని సహాయం కొరకు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను సంప్రదించగలరు.