ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ది ధ్యేయంగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి అధ్యక్షతన ప్రవాసాంధ్రులకు అనేక ఉచిత సేవలు అందిస్తోంది. ముఖ్యంగా కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక ఆసరా - ప్రవాసాంధ్ర భరోసా బీమా, ప్రమాదవసాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా, ఉచిత అంబులెన్సు సేవ, విదేశాలకు వెళ్లి స్వదేశానికి రాలేక ఇబ్బంది పడుతున్న వారిని స్వదేశానికి తీసుకురావడంలో సహాయం...ఇలా మరెన్నో సేవలను ప్రవాసాంధ్రులకు అందిస్తోంది. అంతేకాకుండా ఉపాధి, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే కార్మికులకు, ఉద్యోగులకు సక్రమ వలసలపై ముందస్తు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.
మన రాష్ట్రం నుండి చాలామంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే అక్రమ ఏజెంట్ల మాటలు నమ్మి, అవగాహన లేకుండా వెళ్లి ఇబ్బందులకు గురవుతున్న వారి కోసం, ఏపీఎన్ఆర్టీఎస్ వలసలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్లు, పోలీసులు మరియు జిల్లా పరిపాలన విభాగం సమన్వయ సహకారాలతో ఇవాళ (17.11.23) ఉదయం 10:00 గంటలకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో, మధ్యాహ్నం 3 గంటలకు అమలాపురం నందు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల అంబేద్కర్ భవన్ వేదికగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాజోలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CI శ్రీ. గోవింద రాజు, SI శ్రీ. పృధ్వి, రాజోలు గ్రామ సర్పంచ్ శ్రీమతి రేవు జ్యోతి మరియు అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ వొమ్ములు ఐపి నాయుడు, DSP శ్రీ. అంబిక ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి. రెడ్డి సత్య నాగమణి మరియు వార్డ్ కౌన్సెలర్ శ్రీమతి దుర్గ బాయి పాల్గొన్నారు.
ముందుగా ఏపీఎన్ఆర్టీఎస్ డిప్యూటి డైరెక్టర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్రులకు అందిస్తున్న వివిధ సేవల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో CI శ్రీ. గోవింద రాజు మాట్లాడుతూ....విదేశాలకు వెళ్ళే వారు ఎవరెవరి మాటలో నమ్మి సులువైన పద్దతిలో అక్రమంగా దేశంకాని దేశం వెళ్లి, ఇబ్బంది పడకుండా నియామక ఏజెంట్లు, APNRTS వంటి ప్రభుత్వ సంస్థలను సంప్రదించి పూర్తి అవగాహనతో వెళ్లాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమం ఎంతో మందికి ఉపయోగకరమని, నిర్వహించినందుకు ఏపీఎన్ఆర్టీఎస్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీ వొమ్ములు ఐపి నాయుడు మాట్లాడుతూ... ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి ఈ అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు.
మంచి జీతం కోసం చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది అక్రమ ఏజెంట్ల మాయమాటలకు మోసపోయి ఆయా దేశాలకు వెళ్ళిన తర్వాత కష్టాలు పడుతున్నారు, తిరిగి స్వదేశానికి ఎలా రావాలో తెలియక సందిగ్దంలో ఉంటున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థలను సంప్రదించి క్షేమంగా వెళ్లిరండి అని DSP శ్రీ. అంబిక ప్రసాద్ తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు హర్షనీయమని, మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమాలకు హాజరైన స్వచ్చంద సంస్థల వలంటీర్లు, మహిళా పోలీసులు, మెప్మా (MEPMA) సభ్యులను... ఏపీఎన్ఆర్టీఎస్ ప్రతినిధులు ప్రతి ఇంటికి ఏపీఎన్ఆర్టీఎస్ అందిస్తున్న సేవలను తెలియజేయాలని కోరారు.
విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్నవారు ఏదేని సహాయం కొరకు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను సంప్రదించగలరు.