తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలో శ్రీనివాస కల్యాణం కనుల పండుగగా జరిగింది. ర్యాలీ(నార్త్ కరోలినా), జాక్సన్ విల్ (ఫ్లోరిడా), డెట్రాయిట్, చికాగో నగరాల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి రూపంలో భక్తులకు దర్శన మిచ్చారు. తెలుగు, భారతీయ ధార్మిక సంస్థల నుంచి ఏపీఎన్ఆర్టి సొసైటీకి వచ్చిన అభ్యర్థనల మేరకు ఏపీ ప్రభుత్వం, టీటీడీ స్వామి వారి కల్యాణ మహోత్సవాలను వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించింది. తెలుగు భక్తులే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు 12 వేలకుపైగా ఎన్ ఆర్ ఐలు స్వామివారి కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షిం చారు. ఆయా ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. భక్తులందరికీ తిరుమల నుంచి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు. ఏపీఎన్ఆర్టిఎస్ అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలతో నార్త్ అమెరికాలోని 14 నగరాల్లో చేపట్టిన శ్రీనివాస కల్యాణోత్సవాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో కెనడాలో మూడు, అమె రికాలోని నాలుగు నగరాల్లో దిగ్విజయంగా నిర్వహించామన్నారు. జూలై 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఏడు నగరాల్లో కల్యాణోత్సవాలను జరిపించనున్నట్టు తెలిపారు. ర్యాలీ కల్యాణోత్సవంలో ఈశ్వర్ రెడ్డి, మహిపాల్ మాలే, జాక్సన్ విల్లె లో మల్లికార్జున, ప్రభుత్వ సలహా దారు వాసుదేవ రెడ్డి, డెట్రాయిట్ లో మహేష్, బాలాజీ, సరేస్, చికాగోలో శరత్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.