తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటో, మాంట్రియల్, ఒట్టావా నగరాల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. టీటీడీ కెనడాతో పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 14 నగరాల్లో శ్రీనివాస కల్యాణం జరుపుతోంది. ఇందులో భాగంగా టీటీడీ నుంచి వెళ్లిన అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణ క్రతువును జరిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్ టిఎస్ టీటీడీతో పాటు ప్రవాస భారతీయులను సమన్వయం చేసింది. తెలుగువారే కాకుండా ఇతర భారతీయ రాష్ట్రాలకు చెందిన 10 వేల మందికి పైగా ఎన్ఆర్ఐ భక్తులు కల్యాణ ఘట్టాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు తిరుమల నుంచి తీసుకెళ్లిన లడ్డూ ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ప్రవసాంధ్రుల వ్యవహారాల ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్ఆర్ టిఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్.మేడపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి కల్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 17 నుంచి జూలై 23 వరకు యూఎస్ఏలో 11 నగరాల్లో శ్రీవారి కల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ మహోత్సవంలో కెనడాలోని ఇండియా హై కమిషన్.. హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, స్థానిక ఎంపీలు చంద్ర ఆర్యా, ఆనా రాబర్ట్స్ పాల్గొన్నారు. తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో చారి సమంతపూడి, కరుణాకర్ రెడ్డి పాపల, శ్రీనాథ్ కుందూరి, కల్పన మోటూరి, వైశంపాయన్ దతార్, అరుణ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్లు జగన్మోహన్, వేణుగోపాల్ కల్యాణ ఏర్పాట్లు చేశారు. ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్వామివారి కల్యాణాన్ని వెబ్ లైవ్ కవరేజీ అందించారు.