తిరుపతి దేవ స్థానముల ఆధ్వర్యంలో కెనడా, అమెరికాలో శ్రీవారి కళ్యాణోత్సవాలు జూన్, జూలై నెలల్లో 14 నగరాల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం, బ్రహ్మోత్సవం పత్రికా ప్రకటన విడుదల చేసిన ఏపీఎస్ఆర్డీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి. కెనడా, అమెరికాలో స్థిరపడిన తెలుగు భారతీయుల కోసం జూన్ 4వ తేదీ నుండి జూలై 23 వ తేదీవరకు పద్నాలుగు నగరాలల్లో శ్రీ మల యప్ప స్వామి వారి కళ్యాణములు నిర్వహించసున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా కెనడా యూఎస్ లో "శ్రీనివాస కళ్యాణోత్సవం" పోస్టర్లను వైవీ సుబ్బారెడ్డి, వెంకట్ ఎస్. మేడపాటి, టూరిజం అధ్యక్షులు వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి, కాపుకార్పోరేషన్ అధ్యక్షులు అడపా శేషు, ఇతర కార్పోరేషన్ల డైరెక్టర్లు టిటిడి చైర్మన్ తాడేపల్లి కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ 2022 నెలల్లో యూఎస్ లోని 20 నగరాల్లో అత్యంత వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణాలు ఆయా దేశాలలోని తెలుగు అసోసియేషన్ల, ధార్మిక సంస్థల సహకారంతో నిర్వహించామన్నారు. గత నెల 28వ తేదీన బహ్రెయిన్‌లో నిర్వహించిన కళ్యాణోత్సవానికి దాదాపు 15 వేలమందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారన్నారు. కెనడా యూఎస్ లోని పలు తెలుగు అసోసియేషన్లు. ధార్మిక, సేవా సంస్థల కోరిక మేరకు ఆయా దేశాలలోని భక్తులకోసం తితిదే శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ ఆర్ టీఎస్ ఆయా నగరాల్లోని కార్యనిర్వాహకులతో సమన్వయం చేస్తోందన్నారు. తితిదే నియమాల ప్రకారం శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వెళ్ళే అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలవుతుంది. తిరుమలలో లాగానే శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆయా నగరాల్లో తెలుగు, భారతీయ అసోసియేషన్లు లడ్డూ ప్రసాదాలతో పాటు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. ఉచితంగా శ్రీవారి కళ్యాణోత్సవం తిలకించడానికి అందరూ ఆహ్వానితులే. భక్తులందరూ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని తితిదే ఛైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. కెనడా, అమెరికాలో దేవదేవుని కళ్యాణాలు నిర్వహించడానికి ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అక్కడి ఏర్పాట్లను, తదితర విషయాల్లో ఇటు తితిదే అర్చకులు, వేదపండితులతో సమన్వయం చేస్తున్నామని ఏపీఎన్ ఆర్ టీఎస్ అధ్యక్షులు వెల్లడించారు.