ఎన్నారై వివాహల సమస్యల పరిష్కారానికి మహిళ పోలీసులు, వాలంటీర్ల సేవలు అభినందనీయమని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎన్ ఆర్ ఐ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ పై తల్లిదండ్రులు అవగాహనతో సమస్య పరిష్కారానికి, ఫిర్యాదులు చేయడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో సిఐడి డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ ఎన్ఆర్ఐ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ పై భారతీయ మహిళల హక్కులపై సామాజిక, చట్ట పరమైన సాధికారత అనే అంశం పై ఒకరోజు సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వాసిరెడ్డి పద్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, వార్డుకు ఒక మహిళా పోలీస్ ని ప్రతినిధిగా నియమించిన ఘనత మన రాష్ట్రానికి దక్కుతుందన్నారు. సామాన్యులకు మెరుగైన సేవలు అందిస్తూనే మహిళలు చిన్నారులు రక్షణ ధ్యేయంగా మహిళా పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా, ఆదర్శనీయంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ కృషిని వాసిరెడ్డి పద్మ ప్రశంసించారు. ఎన్నారై వివాహాల పట్ల తల్లిదండ్రులు ముందుగా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇందుకుగాను ఆయా దేశాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్ వారి సహకారం తీసుకోవాలన్నారు. అదే విధంగా వివాహం అనంతరం చట్టబద్ధత కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
స్వదేశంలో గానీ విదేశాల్లో గాని ఏ విధమైన సాంప్రదాయంలో వివాహం జరిగిన వెంటనే ఎంబసీలో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఎన్నారై వివాహాలకు సంబంధించి చట్టాల విషయంలో మహిళల భద్రత రక్షణ సాధికారతపై చర్చ జరగాలన్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ పై పార్లమెంట్లో డిబేట్ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ సంజయ్, ఎ. అశోలి చలై, సంయుక్త కార్యదర్శి, జాతీయ మహిళా కమిషన్ కె.జి.వి. సరిత, ఎస్పీ, సీఐడీ, వెంకట్ ఎస్. మేడపాటి, ప్రభుత్వ సలహాదారు ఏపీ ప్రెసిడెంట్, ఏపీ ఎన్ ఆర్ టీ సొసైటీ, తాడేపల్లి, ఎం.లక్ష్మణరావు, సీఐడీ న్యాయ సలహాదారు. సరస్వతి రాజు లియర్, సోషియాలజీ సోషల్ వర్క్ ప్రొఫెసర్, ఏ ఎన్ యు. డాక్టర్ కె. గౌరి, కోఆర్డినేటర్, న్యాయ విభాగం తదితరులు పాల్గోని ప్రసంగించారు.