తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో జూన్ 25 వ తేదీన అమెరికాలోని డల్లాస్ లో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. APNRTS.... డల్లాస్ లోని కార్యనిర్వాహకవర్గం, ధార్మిక, సేవా సంస్థలతో ముందునుండే కళ్యాణోత్సవంలో ఎక్కడా ఏ లోటు లేకుండా ఎప్పటికప్పుడు సమన్వయము చేస్తూ వచ్చింది. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించారు. వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తీ పరవశంతో పులకించారు. కళ్యాణ వేదిక అలంకరణ చూసిన ప్రతి ఒక్కరికి కనులపండుగలా ఉంది... శ్రిదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. అనంతరం తిరుమల నుండి తీసుకెళ్ళిన లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందజేయటం జరిగింది. ఈ కళ్యాణంలో తితిదే అధ్యక్షులు శ్రీ వై.వి. సుబ్బా రెడ్డి దంపతులు, ఏఈఓ శ్రీ వెంకటేశ్వర్లు, విశాఖపట్నం ఎంపీ శ్రీ. ఎంవివి సత్యనారాయణ, APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, ఎన్నారై సలహాదారు (క్యాబినెట్ ర్యాంక్) శ్రీ. జ్ఞానేంద్ర రెడ్డి, ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ రత్నాకర్ పండుగాయల, YSR కడప జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీ. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,NATA అధ్యక్షులు శ్రీ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీ రఘువీర్ రెడ్డి భండారు, డా. ఎన్. వాసుదేవ రెడ్డి, శ్రీ. రమణ లష్కర్, శ్రీమతి. ఇందు పంచెప్రుపుల మరియు మిగతా కార్యవర్గ సభ్యులు, APNRTS కోఆర్డినేటర్లతో సహా పలు తెలుగు అసోసియేషన్లు మరియు అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.