అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో ఈరోజు (11.06.22) USA శ్రీనివాస కళ్యాణోత్సవం పోస్టర్లను తితిదే అధ్యక్షులు శ్రీ సుబ్బా రెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి , APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు..ఏపీ ప్రభుత్వ సంస్థ APNRTS ఆయా నగరాల్లోని కార్యనిర్వాహకులతో సమన్వయము చేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రవాస భారతీయుల అసోసియేషన్ల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో, జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో స్వామివారి కళ్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు. ఆయా నగరాల్లో కార్యనిర్వాహక వర్గం భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కళ్యాణోత్సవం తిలకించడానికి గాని, ప్రసాదానికి అని గాని ఎక్కడా రుసుము లేకుండా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందాలని, స్వయంగా తిరుమల నుంచి తెప్పించిన లడ్డూ ప్రసాదాన్ని భక్తులందరికీ అందించడం జరుగుతుందని అన్నారు. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామని సుబ్బారెడ్డి గారు తెలిపారు.. ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.