ఉక్రెయిన్ నుండి స్వస్థలాలకు చేరుకున్న విద్యార్థులు ఇవాళ (21.03.22)గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి కృతఙ్ఞతలు తెలియజేసారు. శాసనసభలోని సీయం కార్యాలయంలో సీయం గారితో విద్యార్థులు, అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీయం గారు మాట్లాడుతూ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించిన వెంటనే అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని మీ అందరిని సురక్షితంగా మీ ఇళ్ళకు చేర్చారన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించిన అధికారులను సీయం గారు అభినందించారు. అనంతరం విద్యార్థుల చదువు గురించి సీయం గారు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ.. తమను స్వదేశం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని ముఖ్యమంత్రిగారికి ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకున్న దగ్గర నుండి వసతి, ఆహార విషయాల్లో అధికారులు, అక్కడి స్థానికులు బాగా చూసుకున్నారన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దేశం మొత్తం మీద రాష్ట్రం నుండి సరిహద్దు దేశాలకు అధికారులను పంపిందన్నారు. విమానాశ్రయాలలో వీవీఐపీల తరహాలో స్వాగతం పలికారని, అక్కడి నుండి స్వస్థలాలకు చేరే వరకు కూడా విమాన టికెట్లు, స్థానిక ప్రయాణ, వసతి సదుపాయాలను ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయమన్నారు. ఈ తరహా చర్యలు, ఏర్పాట్లు చేసినప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా విపరీత ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో చేసిన పనిని చెప్పుకోకుండా... వెనుకనుండి యంత్రాంగాన్ని సీఎం గారు నడిపిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకామని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఉక్రెయిన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టీ కృష్ణబాబు గారు, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ గారు, ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ శ్రీ. గితేష్ శర్మ గారు, ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్ మేడపాటి గారు, సీఈఓ కె. దినేష్ కుమార్ గారు, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు అహ్మద్ బాబు, నార్త్ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, యూకేలో ప్రత్యేక ప్రతినిధి రవీంద్ర రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.