దుబాయ్ ఎక్స్ పో 2020 లో ఏపీ పెవిలియన్ ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి. ఈ ప్రారంభోత్సవానికి యూఏఈ విదేశాంగ మంత్రి కూడా హాజరయ్యారు. ప్రారంభోత్సవ అనంతరం శ్రీ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ దేశంతో పాటు ప్రపంచ స్థాయి అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఏపీ అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రపంచస్థాయి నైపుణ్యంతో మానవ వనరుల తయారీ, అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు దృష్టి సారించారన్నారు.
కాగా, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ఏపీ పెవిలియన్ ను తీర్చిదిద్దారు. ఏపీలో పెట్టుబడులు, సానుకూలాంశాలపై ఈ పెవిలియన్ ద్వారా అవగాహన కలిగించనున్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్ల వీడియోలను, విద్య, వైద్య, టూరిజం, ఐటీ, పోర్టులపై వీడియోలను పెవిలియన్ లో ప్రదర్శిస్తారు. ఏపీలో మౌలిక సదుపాయాలు, ఎగుమతి అవకాశాల గురించి వివరించడానికి పలు స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా APNRTS సహకారంతో మొదటి రోజు ఏర్పాటు చేసిన తెలుగు సాంస్కృతిక, సంగీత, నృత్య కళలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.