విదేశాలకు వెళ్ళే వారికోసం APNRT Society ద్వారా సక్రమ వలసల పై అవగాహనా సదస్సు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ప్రవాసాంధ్రులకు అనేక ఉచిత సేవలు అందిస్తోంది. APNRT Society అనేక సేవలు అందించడమే కాకుండా... ఉపాధి, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే కార్మికులకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారి కోసం సక్రమ వలసలపై ముందస్తు అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 17వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం లో BREDS స్వచ్చంద సంస్థ కార్యాలయం, బెండి గేటు, వజ్రపు కొత్తూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గౌరవ పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు గారి ఆధ్వర్యంలో APNRT Society అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి, సీఈఓ శ్రీ. దినేష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి డా. సీదిరి అప్పలరాజు గారు మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రాంతం నుండి ఎక్కువమంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. మలేషియా, గల్ఫ్ దేశాలకు వెళ్లి స్వస్థలాలకు రాలేక ఇబ్బందులు పడుతున్నవారు నా దగ్గరికి వచ్చారు. నేను ఆ సమస్యలను APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారి దృష్టికి తీసుకెళ్ళాను. వారు ఆయా దేశాలలో ఉన్న భారత రాయబార కార్యాలయాలతో మాట్లాడి బాధితులు స్వస్థలాలకు చేరుకునేలా చేసారు. APNRTS ప్రవాసాంధ్రులు, వలసకార్మికుల కొరకు అనేక ఉచిత సేవలు అందిస్తోంది. ముఖ్యంగా 24/7 హెల్ప్ లైన్, ప్రవాసాంద్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సేవ..ఇలా అనేక సేవలు అందిస్తోందన్నారు. విదేశాలకు వెళ్తున్నాం కదా అన్న ఉత్సుకతో ఎవరో చెప్పిన మాటలు విని మోసపోకుండా నియామక ఏజెంట్ల ద్వారా సురక్షితంగా వెళ్ళిరండి. ఎలా వెళ్ళలో తెలియకపోతే మీకు సహాయ, సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APNRTS 24/7 హెల్ప్ లైన్ ని సంప్రదించమని తెలియజేసారు.
APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎలాగైతే వివిధ సంక్షేమ పథకాలను అందిస్తోందో, APNRTS ప్రవాసాంధ్రులకు మరియు వలస కార్మికులకు 24/7 హెల్ప్ లైన్ ద్వారా ఉచిత సేవలను మరియు వారికి కావలసిన సహాయ సహకారాలను నిరంతరాయంగా అందిస్తూ తోడ్పాటునిస్తోందన్నారు. APNRTS... గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వలస కార్మికులు మరియు ఆయా దేశాల నుండి తిరిగొచ్చి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్న వారి కోసం ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఇచ్చాపురం, గార, వజ్రపు కొత్తూరు, కంచిలి, సోంపేట, టెక్కలి, పలాస మండలాల నుండి ఎక్కువగా మలేషియా మరియు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. అరకొర సమాచారం, అక్రమ ఏజెంట్ల మాటలు విని దేశం కాని దేశం వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇప్పటికే 5 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మీకు ఎటువంటి సందేహాలున్నా APNRTS 24/7 కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొని పూర్తి సమాచారంతో సక్రమంగా విదేశాలకు వెళ్లాలని కోరారు.
APNRTS సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ ఈ కార్యక్రమానికి సంబంధించి సంబంధిత అధికారులతో సమన్వయము చేస్తూ ఏర్పాట్ల పర్యవేక్షణ చేసారు. APNRTS అందిస్తున్న ఉచిత సేవల గురించి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పలాస ఎండీఓ శ్రీ రమేష్ నాయుడు, వజ్రపు కొత్తూరు ఎండీఓ శ్రీమతి ఈశ్వరమ్మ, ఎమ్మార్వో శ్రీ అప్పలస్వామి, పలాస సిఐ శ్రీ. రాజు, అనంతగిరి ఎంపీటీసి శ్రీ. కామేశ్వర రావు, BREDS స్వచ్చంద సంస్థ సీఈఓ శ్రీ. సాంబ మూర్తి గారు మరియు ఏపీఎన్ఆర్టీ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్నవారు ఏదేని సహాయం కొరకు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను సంప్రదించగలరు.