రావులపాలెం లో గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులకు అవగాహనా సదస్సు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ APNRTS తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం లో గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులకు అవగాహనా సదస్సు నిర్వహించింది. గౌరవ ప్రభుత్వ విప్, APPUC అధ్యక్షులు మరియు కొత్తపేట శాసనసభ్యులు శ్రీ. చిర్ల జగ్గి రెడ్డి గారి ఆధ్వర్యంలో APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి, సీఈఓ శ్రీ. దినేష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శాసనసభ్యులు శ్రీ. చిర్ల జగ్గి రెడ్డి గారు మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS నిర్వహిస్తున్న ఈ అవగాహనా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుండి ఎంతో మంది తెలిసీ, తెలియని దారుల్లో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో, విదేశాల్లో ఉన్నారో వారి కోసమే APNRTS పనిచేస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృత పరుస్తున్న APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారిని ప్రశంసించారు.
APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వలస కార్మికులు మరియు ఆయా దేశాల నుండి తిరిగొచ్చి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్న వారి కోసం ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకుంటే తెలిసీ తెలియని వారు చెప్పిన అరకొర,మోసపూరిత మాటలు నమ్మకుండా మీకు ఎటువంటి సందేహాలున్నా APNRTS 24/7 కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొని పూర్తి సమాచారంతో సక్రమంగా విదేశాలకు వెళ్లాలని కోరారు.
APNRTS సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ ఈ కార్యక్రమానికి సంబంధించి సంబంధిత అధికారులతో సమన్వయము చేస్తూ ఏర్పాట్ల పర్యవేక్షణ చేసారు. మీకు ఏ సందేహాలు ఉన్నా APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను సంప్రదించగలరన్నారు.
అక్రమ ఏజెంట్ల మాయ మాటలు విని, ఏదో ఉపాధి దొరుకుతుంది, మంచి వేతనం లభిస్తుంది అని నమ్మి విదేశాలకు వెళ్లి, ఏమైపోయారో కూడా తెలియని వారు చాలా మంది ఉన్నారు, స్వయంగా నేను చూసి, నాకు తెలిసిన వాళ్ళే చాల మంది ఉన్నారని రావులపాలెం జెడ్పీటీసీ శ్రీ. శ్రీనివాస్ పేర్కొన్నారు. అలా ఎవరూ మోసపోయి ఇబ్బంది పడకూడదనే APNRTS పనిచేస్తోందని, ఎన్నో ఉచిత సేవలందించడమే కాక ఈ అవగాహనా కార్యక్రమాలను వలసలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఎంతో మంచి పరిణామమన్నారు. తెలిపారు. కనుక ఎవరితే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారు APNRTS 24/7 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి పూర్తి సమాచారంతో వాళ్ళమని కోరుతున్నాను అన్నారు.
ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ. ముత్యాల వీర భద్రరావు మాట్లాడుతూ APNRTS ప్రవాసాంధ్రులకు, ముఖ్యంగా వలస కార్మికులకు అనేక ఉచిత సేవలు అందించమే కాకుండా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో రావులపాలెం ఎంపీడీఓ శ్రీ. రాజేంద్ర ప్రసాద్, ఎమ్మార్వో శ్రీ సత్యనారాయణ, సిఐ శ్రీ కృష్ణ, ఎంపీపీ శ్రీమతి లక్ష్మి వెంకట నాగదేవి మరియు APNRTS సిబ్బంది పాల్గొన్నారు.