Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళే వారికోసం సఖినేటిపల్లిలో APNRTS అవగాహన సదస్సు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళేవారి కోసం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అక్టోబర్ 6వ తేదీన అమలాపురం నియోజకవర్గం సఖినేటిపల్లి శ్రీ అల్లూరి సీతారామరాజు క్షత్రియ కళ్యాణ మండపంలో అవగాహనా సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం ఎంపీ చింతా అనురాధ గారు మాట్లాడుతూ విదేశాలకు వెళ్ళేవారు APNRTS వారి పూర్తి సహకారంతో మాత్రమే ఉపాధి అవకాశాలకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎటువంటి సమాచారం లేకుండా వెళ్లడం వల్ల దేశం కాని దేశం వెళ్లి అనేక కష్టాలకు లోనవుతున్నారని అన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ ఉపాధి నిమిత్తమై గల్ఫ్ దేశాలకు రాజోలు నియోజకవర్గం నుండి వేలాదిమంది వెళ్లడం జరిగిందన్నారు. వీరిలో ఎక్కువమంది ఏజెంట్ల చేతిలో మోసపోయి అనేక కష్టాలు పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ విదేశాలకు వెళ్ళే వారికి మార్గదర్శకత్వం చేయడానికి APNRTS 365 రోజులూ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళాలనుకుంటే సరైన సమాచారంతో వెళ్ళాలని కోరారు. సెప్టెంబర్ 22వ తేదీన రాజంపేటలో ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభించి, విజయవంతంగా నిర్వహించామన్నారు. సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ APNRTS ప్రవాసాంధ్రులకు అనేక సేవలందిస్తోందని, వాటిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారు APNRTS 24/7 కు కాల్ చేసి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకొని ప్రయాణం చేయడం మంచిదని డైరెక్టర్ బి.హెచ్. ఇలియాస్ అన్నారు. అనంతరం ఉపాధి నిమిత్తం ఉభయగోదావరి జిల్లాల నుండి విదేశాలకు వెళ్లి, అక్కడ చనిపోయిన 23 మంది కుటుంబాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున APNRTS కుటుంబానికి 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియాను బాధిత కుటుంబాలకు చెక్కుల రూపంలో ఎంపీ అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదుల ద్వారా అందజేశారు.