APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారి సూచన మేరకు డైరెక్టర్ శ్రీ. బి.హెచ్. ఇలియాస్ ఆధ్వర్యంలో కువైట్ ఏపీఎన్ఆర్టీఎస్ కో ఆర్డినేటర్లు కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో భారత రాయబారి శ్రీ. సి.బి. జార్జ్ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై. యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారి నేతృత్వంలో అందిస్తున్న సేవల గురించి శ్రీ. సి.బి. జార్జ్ కు వివరించారు. కువైట్ APNRTS సభ్యులు కువైట్ లో ఉన్న ప్రవాసాంధ్రుల సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే ఏ విధంగా పరిష్కరిస్తున్నారో పూర్తి వివరాలు అందజేస్తూ, కువైట్ లో ఉన్న ఏపీ కి చెందిన తెలుగు ప్రవాసీలు పడుతున్న సమస్యలను వివరించారు. అన్ని విషయాలు విన్న భారత రాయబారి శ్రీ. సి.బి. జార్జ్ గారు APNRTS అందిస్తున్న ఎక్స్-గ్రేషియా, ఉచిత అంబులన్స్ సర్వీస్, ప్రవాసాంధ్ర భరోసా బీమా, అత్యవసర పరిస్థితుల్లో స్వదేశానికి తీసుకురావడం, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ, వివిధ దేశాలలో కో ఆర్డినేటర్లను నియమించడం తదితర సేవలను ప్రశంసించారు. త్వరలో గ్రామ స్థాయిలో APNRTS నిర్వహించబోయే “సక్రమ వలస విధానాల” అవగాహనా కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేసారు. కువైట్ లో తన అనే వారు ఎవ్వరు లేని పేద వారు దురదృష్టం కొద్దీ మరణిస్తే వారి మృతదేహాన్ని స్వదేశం పంపేందుకు మరియు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వదేశం వెళ్ళడానికి డబ్బులు లేక అవస్థలు పడుతున్న వారికి ఎంబసీ ద్వారా ఉచిత విమాన టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎంబసీ దృష్టికి నిజమైన పేద బాధితుల వివరాలు తీసుకొని వస్తే తప్పకుండా ఉచిత విమాన టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇలియాస్ గారు మాట్లాడుతూ... కువైట్ లో ఒక భారత రాయబారిగా తెలుగు ప్రజల సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్న మొట్ట మొదటి అంబాసిడర్ శ్రీ. సి.బి. జార్జ్ గారని, వారిని అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, APNRTS తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.