శ్రీ. గిడుగు వెంకట రామమూర్తి 157 వ జయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సమాజం వారు (SATC) తెలుగు భాష దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఆన్ లైన్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ. వెంకయ్య నాయుడు గారు, గౌరవ అతిథులుగా తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కవిత గారు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు, SADiLaR సంచాలకులు ఆచార్య లాంగా ఖుమాలో గారు, వేములవాడ MLA డాక్టర్. రమేష్ చెన్నమనేని గారు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య గారపాటి ఉమామహేశ్వర రావు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ. వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ, నిత్యవ్యవహారంలోని తెలుగు భాషలో ఉన్న తీయదనాన్ని తెలియజెప్పిన వారు శ్రీ. రామమూర్తి పంతులు అన్నారు. భాష, సమాజం, సంస్కృతి వేరు వేరు పదాలు కావొచ్చు. కాని, ఉన్నతమైన సంస్కృతి ద్వారానే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుంది. అలాంటి సంస్కృతిని అందరికీ చేరువ చేయడం ఎలా అంటే అది భాష ద్వారానే సాధ్యం అవుతుంది. శాస్త్ర,సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందే క్రమంలో మనకు తెలియకుండానే చేస్తున్న పొరపాటు మాతృ భాషను విస్మరించడం. భాషను కాపాడుకోవడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చని యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. భాషను బట్టి జాతిని గుర్తిస్తారు. కాలగమనం లో సరిహద్దులు మారినా మాతృభాష మారలేదు.
శ్రీ. వెంకట్ మేడపాటి గారు మాట్లాడుతూ వ్యావహారిక భాషా పితామహుడు శ్రీ. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి ఆగస్టు 29 ని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకువచ్చిన మహనీయులు శ్రీ. గిడుగు రామమూర్తి పంతులు గారు అన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నతనం నుండే తెలుగులో మాట్లాడటం నేర్పించాలని, అవసరాలకు, చదువు,ఉద్యోగాలకు ఇతర భాషలు నేర్చుకున్నా, తెలుగు మర్చిపోకూడదు అన్నారు. నిత్య వ్యవహారాలు మన భాషలోనే మాట్లాడాలి, భాషపై పట్టు సాధించాలన్నారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా అని మనం పాడుకుంటాం..ఆ ఘనకీర్తిని వర్తమానం లో చూపిద్దాం..భవిష్యత్తు తరాలకు అందిద్దాం అన్నారు. #GiduguVenkataRamaMurthy #August29 #APNRTS