ఏపిఎన్నార్టి సొసైటీ తన సేవల విస్తరణ లో భాగంగా డా. వై.యస్.ఆర్ కడప జిల్లా రాజంపేట లో “వై.యస్.ఆర్ ప్రవాసాంధ్ర సేవా కేంద్రం” ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంజద్ బాషా గారు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మరియు ప్యానెల్ స్పీకర్ శ్రీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గారు, కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ వై.యస్. అవినాష్ రెడ్డి గారు, రాయచోటి శాసన సభ్యులు, చీఫ్ విప్ శ్రీ. శ్రీకాంత్ రెడ్డి గారు మరియు కోడూరు శాసన సభ్యులు, విప్ శ్రీ శ్రీనివాసులు గారి చేతుల మీదుగా ప్రారంభించారు.
ఏపిఎన్నార్టి సొసైటీ ప్రవాసాంధ్రులకు అందించే వివిధ సేవలు... ప్రవాసాంధ్రుల కుటుంబ ఆర్ధిక భద్రతలో భాగంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా అందించడం, విదేశాల్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన ప్రవాసాంధ్రుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలనే సదుద్దేశంతో ఒక్కో కుటుంబానికి రూ. 50,000ల ఎక్స్ గ్రేషియా, అభ్యర్థులకు అంతర్జాతీయ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు-ఉద్యోగావకాశాలు కల్పించడం, ప్లేస్ మెంట్ డ్రైవ్స్ నిర్వహించడం, దేవాలయాల దర్శనం కల్పించడం, విద్యావాహిని ద్వారా విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీ ల గురించి తెలియజేయడం, పాస్పోర్ట్ లో మార్పులకు సలహాలు, విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రులకు మరియు ఎవరైతే కదలలేని స్థితిలో నిస్సహాయంగా ఉన్నారో అలాంటి వారికి సహాయంగా ఒక సహాయకుడిని ఇచ్చి ఉచిత అంబులెన్స్ సేవ అందించడం.. తదితర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఈ కేంద్రంలో లభిస్తాయని, ప్రధాన కార్యాలయం రాలేని వారికి, రాయలసీమ ప్రాంత వాసులకు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందని సొసైటీ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు తెలిపారు.
ఈ ప్రవాసాంధ్ర సేవా కేంద్రం ప్రారంభోత్సవానికి రాజంపేట శాసనసభ్యులు శ్రీ. వెంకట మల్లికార్జున రెడ్డి , మాజీ శాసనసభ్యులు, రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ. అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ శాసనసభ్యులు శ్రీ. వెంకట సుబ్బయ్య,కమలాపురం శాసన సభ్యులు శ్రీ. రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు శ్రీ. రఘురామి రెడ్డి, జమ్మలమడుగు శాసన సభ్యులు శ్రీ. సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ. శివ ప్రసాద్ రెడ్డి, శాసనమండలి సభ్యులు శ్రీ గోవింద రెడ్డి, మాజీ మేయర్, వై.యస్.ఆర్ కడప పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ సురేష్ మరియు వై.యస్.ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీ. చేవూరి హరికిరణ్, ఐఏఎస్, కడప జిల్లా ఎస్పీ శ్రీ. అన్బురాజన్ ఐపిఎస్ తదితరులు హాజరయ్యారు.